Sri.Y.Purushothama Reddy & Family
యమ్మనూరు పురుషోత్తమ రెడ్డి
నా పుట్టుక 12-12-1960 తేదీన జరిగింది. అదే సంవత్సరంలో దక్షిణానిలం వీచింది, రాయబారమూ జరిగింది. 1970-71 ప్రాంతంలో మేము ఆస్తులన్నీ పోగొట్టుకుని సొంత ఇంటి నుంచి పెంకుటింటిలోకి మారడం నాకు గుర్తు. కాలం ఎలా ముందుకు సాగిందో అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో; 1980లో మైసూర్లో M Sc Ed చేరాను.1982లో పీ జీ ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత 82లోనే కడప జిల్లా ఖాజీపేటలో ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో కొన్ని నెలల పాటు జూనియర్ లెక్చరర్ గా పనిచేసి, హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ లో కొన్ని రోజుల పాటు TGT గా పనిచేసి, బాంబే లో కేంద్రీయ విద్యాలయ లో నవంబర్ 1983లో PGT గా చేరాను. తరువాత సెప్టెంబర్ 1984లో చిత్తూరు జిల్లా లోని కుప్పం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జూనియర్ లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. అక్కడ ఉండ గానే 20-6-1986లో అనిమలకు చెందిన యస్.వి.నారపరెడ్డి H M, Z P H S, శేషమ్మ గార్ల కుమార్తె పద్మావతి తో వివాహం జరిగింది. 1987లో బదిలీ పై అనంతపురం రావడం, 23-5-1987 లో మనోజ్ఞ తరువాత 13-12-1990 లో అభిజ్ఞా జన్మించడం కాలక్రమంలో జరిగిన సంఘటనలు. పిల్లలిద్దరూ B.Tech. Computer Sc complete చేసిన తర్వాత వారి వివాహాలు 1-10-2009, 31-5-2013 తేదీలలో వరుసగా జరిగాయి.పెద్దల్లుడు ప్రదీప్ రెడ్డి, నంద్యాల వాస్తవ్యులు అంబటివెంకటకృష్ణారెడ్డి, ప్రభావతి గార్ల ప్రధమ పుత్రుడు, DRDO లో Scientist గా ప్రస్తుతం బెంగళూరు లో పని చేస్తున్నాడు. చిన్న అల్లుడు శివ జ్యోత్ రెడ్డి, పులివెందల మండలం గోటూరుకు చెందిన లింగాల శివ ప్రసాద్ రెడ్డి, వీరకుమారిల ప్రధమ పుత్రుడు, U S లో ఒక ప్రైవేటు కంపెనీలో R&D లో పని చేస్తున్నాడు. మనోజ్ఞ కు ఇద్దరు పిల్లలు శ్రద్ధ, శ్రేష్ట. అభిజ్ఞ కుమారుడు ధార్మిక్ రెడ్డి. డిగ్రీ కళాశాల లెక్చరర్ గా పదోన్నతి పొంది1999 నుండి వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి ప్రస్తుతం గుంతకల్లు లో పని చేస్తున్నాను.
నేను రాసి దాచుకొన్న కొన్ని కవితల గురించి...
మా ఇంటికి కవిత్వం రాయడం అప్పుడే మొదలు పెట్టిన వారి నుంచి, కవులుగా, రచయితలుగా పేరు మోసిన వారి వరకు; అందరూ రావడం, సాహిత్య చర్చలు జరపడం నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను గమనించిన ఒక నిత్య కృత్యం. ఈ అనుభవం నుండి వచ్చిన శ్రుత పాండిత్యమే పుస్తక పఠనం పై నా దృష్టిని మరల్చింది. దీనికితోడు సాహిత్యం పై గల విభిన్న మైన పుస్తకాలను, పత్రికలను మా నాన్న ఎప్పుడూ తెచ్చేవాడు; వాటిని చదివి వాటిలో తనకు నచ్చిన లేదా నచ్చని అంశాలను మాకు వివరించేవాడు. ఇలా నాకు దాదాపు పన్నెండు సంవత్సరాల వయసునుండే గోపీచంద్, చలం, కొడవటిగంటి కుటుంబరావు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, బాలగంగాధర తిలక్, పుట్టపర్తి నారాయణాచార్యులు వంటి వారు, నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, పెద్దన, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి, కంకంటి పాపరాజు వంటివారు నాన్నద్వారా పరిచయమౌతూ వచ్చారు. ఇప్పటికీ కవిత గానీ, కథ గానీ కనిపిస్తే వెంటనే చదవాలనే ఆశ చావలేదు. కథలూ, కవితలు రాయాలని ఎప్పుడూ వుంటుంది. ఎప్పుడైనా ప్రయత్నిస్తే రాసినదేది తృప్తి నివ్వదు. అందువల్ల మూడ్ వచ్చినప్పుడు రాసి దాచుకొన్నవి కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇది కేవలం మానాన్న నుండీ మాకు సోకిన కవిత్వ వాసనలు తెలియపరచడానికి మాత్రమే.
కవిత 1
అలజడి
2-11-1972. ఏడవ తరగతి చదువుతున్నాను. అప్పటికే నాన్న రాసిన రాయబారం ఆయన స్టయిల్ లో చదువుతున్నప్పుడు చాలా సార్లు విన్నాను. ఆ మాత్రా ఛందస్సు నాకు బాగా నచ్చింది. నాన్నే చెప్పాడు ఒక మాత్ర , రెండుమాత్రలంటే ఏమిటో. మా అన్నలు నన్ను ఆట పట్టించినప్పుడు ఆ మాత్రాఛందస్సులో ఇలా నా కోపం, కసి బయట పడ్డాయి.
అడుగడుగున గండాలే
చిత్రహింస లెన్నెన్నో
నేకుములుచు నేకృంగుచు
ఉంటినినే నామదిలో
తెలుసుకోండి ఏమిసేతు
మాఅన్నలు నన్నెట్లో
ఏడిపించ చూచెదరూ
వెకిలింతురు ఉగ్రుడనై
నేతిట్టెద వార్కొట్టెద
రేడ్చదనే ఏమిసేతు
అదేజరుగు సమయంలో
నాపైగల ప్రేమకొద్ది
మాయమ్మా మానాన్నా
సహాయమున తోడ్పడెదరు
ఇదియేనా చరితమురా
కవిత 2
వ్రాయలేను వ్రాయలేను
15.7.1978. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న రోజులు. పదిహేడు సంవత్సరాల వయసు దాటి పదునెనిమిదిలోఉన్నాను. శ్రీశ్రీ మహా ప్రస్థానం పూర్తిగా అర్థం కాకపోయినా ఆకవితల్లోని వేగం నన్నెంతగానో ఆకట్టుకుంది.నాన్న నుండి అర్థమైన కొద్దిపాటి కమ్యూనిజం నా బుర్రలో ఉంది. ఇవి 'వ్రాయలేను' అని వ్రాయించాయి.
నాకూ ఉంది -
సుందర సుమధుర భావాలకు
ఫ్రేముగట్టి
ఇంటి ముందు గుమ్మంలో తగిలించాలని -
అంతేకాదు
అందమైన స్వప్నాలను
ప్రతిరాత్రీ
నయనాలకు విందులుగా చూడాలని -
ఇంకా
మల్లెలను, తీగలను,
ఎలదేటుల పాటలను,
అలల రొదల అల్లరులను,
నీలి నీలి ఆకాశపు విశాలతను
నన్నయ వలె -
పెద్దన వలె -
భావ కవుల భావనలో
వ్రాయాలని -
రసిక జనులనుర్రూతలు ఊగించాలని -
గుండెలు పిండెయ్యాలని -
కానీ -
నే వ్రాసిన
ప్రతి పదమూ -
ఆకటితో, చీకటిలో
అరవలేక చస్తున్నాయి
చావలేక చస్తున్నాయి
అందుకే -
ఆ ఆకలి తీరువరకు
ఆ చీకటి తొలగువరకు
తేనెలలో సొక్కిసోలు
మధుపమ్ముల సంగీతం
వెన్నెలలో కాలుతున్న
విరహంలో ఆనందం
వగైరాలు వగైరాలు
వ్రాయలేను వ్రాయలేను
కవిత 3
వ్యత్యాసం
26-10-1978. ఏదో వ్రాయాలనే ఉత్సాహం తగ్గలేదు.మూడు నెలల తర్వాత 'వ్యత్యాసం' వ్రాసాను. నాన్నకు చూపిస్తే, అరసం నడుపుతున్న 'అభ్యుదయ' కు పంపమన్నాడు. అలా నేను రాసిన కవితలలో అచ్చైన మొదటిదీ, చివరిదీ ఇదే.
ఈ కిటికీలో నుండి చూస్తున్నా -
చింకిపాతల దుస్తులేసి
కూడు లేని బొచ్చెబట్టి
బిచ్చానికి పయనమైన
కటిక దరిద్రుడు -
కడుపు మంటలో
తుంటబీడీ ముట్టించు కోవడం -
కాయంలో తడినంతా
డబ్బులకై విక్రయించి
సారాతో శరీరాన్ని
తడిచేసుకు బ్రతుకుతూన్న
లేని వాన్ని -
కుటుంబాన్ని పోషించ లేని వాన్ని -
శరీర పోషణకై -
సంఘంలో నీచంగా
వీధుల్లో 'ఛీపు'గా
శరీరాన్ని అమ్ముకునే
అమ్ముల్ని, దిగజారిన రొమ్ముల్ని -
తనతాతల 'స్టేటస్సు'ను
నిలుచోబెట్టేటందుకు;
నలుగురిలో మెప్పు కొరకు
అభిమానం లప్పకొరకు
గొప్పలకు పోయి
అప్పులపాలైన అప్పారావ్
తనలో తాను గొణుక్కుంటూ పోవడం -
ఊరకుక్కలూరకనే
కాట్లాడుకు చస్తూంటే
ఎదురింట్లో వేటకుక్క
విలాసాతి దరహాసపు చూపుజూసి
నిశ్చలంగా 'భౌవ్'కరించడం -
'సింపుల్'గా ముస్తాబై
'ఇంపాలా'కారులోన
జంపాలాలూగుతున్న
టెంపోరావుని -
వాడి ఇంపోర్టెడ్ వైఫ్ ను -
కాని -
ఒక అనుమానం -
దేవుడి దృష్టిలో అందరూ సమానం -
మరి ఈ కిటికీలో ఎందుకీ వ్యత్యాసం
కవిత 4
పలాయనం
29-9-1989. పదకొండు సంవత్సరాలు గడిచిపోయాయి.రాయాలని అనిపించలేదు. అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అధ్యాపక వృత్తిలో ఉన్న సమయంలో ఒకసారి కవిత్వదోరణులపై రాయాలనిపించింది. కవితలు వేమన పద్యాలంత స్పష్టంగా ఉండాలనీ, కనీసం నా లాంటి ఒక మోస్తరు పాఠకుడినైనా కదిలించాలనీ నా అభిప్రాయం.
మేము కవులం
కౌలుకు గుత్తకు కవితలు వ్రాస్తాం
ఆస్థాన కవులుగా ప్రశస్తి పొందుతాం
మేమేమైనా చెయ్యగలం -
దేవతలను సృష్టించాం
శృంగారం గుప్పించాం
దెయ్యాలను రప్పించాం
భయకంపిత విహ్వలురుగ
మూఢులుగా మూర్ఖులుగా
ప్రజలను మార్చేశాం
అంతేనా -
ఎంకి ఎడద వెన్నెలలను
పూయించాం కాయించాం
కోయిలలూ, తుమ్మెదలూ
మా పాటలె పాడతాయి
మా ఎదలనె మీటుతాయి
అవును!
ధరలు ఎగసి ఆకాశపు
పల్లకిలో రాజకీయ
బోయీలతొ ఎగరనీండి
ఎదగనీండి - మాకేమిటి?
అరగడుపుల మంటలలో
జనవాహిని మసిమసిగా
నుసినుసిగా
మారిపోని, మాడిపోని -
రెడ్ లైటుల చీకటిలో
గతితప్పిన పతిత బతుకు
వికృత రతిలో
పైశాచిక కుతిలో
యంత్రానికి మల్లే
యాంత్రికంగా
ఊగిపోని, సాగిపోని -
మాకేమిటి?
వీటికి మేమతీతులం
నీరోకే వారసులం -
"అనంత విశ్వాంతరాళంలో
నా భూగోళం నగ్నంగా
రాక్ యండ్ రోల్ చేయడం
నేను చంద్రమండల
ఉపరితలం నుండి
ఒంటికన్నుతో
వీక్షించాను సమీక్షించాను'
అనగలం మనగలం -
అప్పుడప్పుడు
Once in a blue moon
'వస్తున్నాయి వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాల్ -
అదిగో వినపడలేదా
మరో ప్రపంచపు కంచు నగారా'
అని కూడా అన్నామే!
ఇప్పుడిప్పుడే కొత్తకొత్తగా
మరో ప్రపంచపు ప్రస్థానాలకు
స్వస్తి వాక్యములు ఉచ్చరించుచు
ఏదో తెలియని అస్తవ్యస్తపు
మ్యూజింగులతో జిమ్మిక్కులతో
వచన కవితలను
వచియిస్తున్నాం
రచియిస్తున్నాం
అస్పష్టత మా కవితకు ప్రాణం
అర్థంలేని భావాలకు
అర్థంకాని భాష్యాలు చెప్పడం
మా ప్రస్తుత కర్తవ్యం
మా కవిత మాకే
స్పష్టమైన అస్పష్టత
'కళ కళకోసమే
కళ కలకోసమే'
మేము మీ కోసం
రాయడం లేదు
మాకోసం రాస్తున్నాం.
అయ్యా!
మా మనోవల్మీకపు చెద
మా ఎద రొద చేస్తున్నది
మమ్మొదిలేయండి
మీనుండి దూరంగా
చీకటి మనోకుహరాలలోకి
ఏకాంతంగా వెడతాం
కైతలు కడతాం
కవిత 5
గారడీ
30-9-1989. మరుసటి రోజు మరో కవిత పుట్టుకొచ్చింది. రాజీవ్ గాంధీ 21st century పై
ప్రతిపాదించిన ప్రణాలికలు చూసాను. మనసులో ఒక conflict మొదలైంది. ఇలా అక్షర రూపం దాల్చింది.
నా ప్రియతమ ప్రజలారా!
21st Century కి ప్రస్థానం చేస్తున్నాం
రండి! రండి!!
కంప్యూటర్ చిప్పులుగా
మడతబందు కీలులుగా
నట్టులుగా బోల్టులుగా
మిమ్ముపయోగిస్తాం
మీ రక్తపు ద్రావకాల
సోల్డరింగు అతుకులతో
రాబోట్లను మీబోంట్లకు
ప్రతిరూపంగా పరికల్పన
చేసేస్తాం!
కంప్యూటర్ అక్షరాల
మీ పేరుకు చిరయశస్సు
కల్పిస్తాం!!
మీతో వేగలేక చస్తున్నాం
అనామకులు అనిమిక్కులు
రేయనకా పగలనకా
ఆకలి మూల్గుల తిత్తులతో
అశాంతులను రేపుతారు
ఇట ప్రపంచ శాంతికి
సరి కొత్త 21st formula
సమాయత్తం చేస్తున్నాం
లాఠీలకు తూటాలకు
ఎరుపెక్కిన జెండాలకు
శెలవ్! శెలవ్!!
విప్లవ కవికుల
తిలకులకిక
Good Bye!
ఆకలి కేకల సడి
పొలిమేరల కావల
దేశవాళి సమస్యలకు ఇది
విదేశీ గోసాయి చిట్కా
Two birds at one shot
మానవాళికిదే మా
చివరి నివాళి -
వందేమాతరం!
వందేమాతరం!!
*********************************
కవిత 6
హత్య
3-10-1989. మూడు రోజుల తరువాత అవినీతి, అన్యాయం, అనైతికత వంటి వాటికి చీకటిని ప్రతీకగా పెట్టుకుని ఆలోచనల్లోకి వెళ్లి నప్పుడు అవతరించిన కవిత.
చీకటి ప్రపంచాన్నంతా కమ్మేస్తోందని
వెలుగును జిలుగు తెరల చాటుకు తరిమేస్తోందని
నాకు తెలిసి
ఉన్న కాస్తోకూస్తో వెలుగులో
జీవితాన్ని వెలగబెట్టే నేను-
ఇంతమందిని ఆకర్షించి
మైమరపించి మరులు గొల్పే
ఈ చీకటిని
అజాత శత్రువునై
ఆహ్వానించాలని నిర్ణయించాను
ఒక ఉషోదయ వేళ నిశాప్రియుడనై
చీకటిని నేనాహ్వానించాను
నాతో ఉండిపొమ్మన్నాను
నా నీడను మింగి పొమ్మన్నాను
అలా చీకటితో (లో)
ఎంతకాలం గడిచిందో
క్షణమొక యుగంగా -
పదియుగాలుకూడా గడవకమున్నే
చీకటి నాకు నమస్కరించింది
"నీయిరుకు మనస్సులో నాకు స్థానం లేదం"ది
"విశాల హృదయులు వీర విహారం చేసే
అనంత విశ్వంలో నన్ను వదిలెయ్య"మంది
"నేనజాత శత్రువున"న్నాను
"అలా నీవనుకుంటే సరిపోతుందా?
నీకు శత్రువు కాని వాడు లేడంది"చీకటి
నాకు కోపం హెచ్చింది
సహనం చచ్చింది
చీకటితో నేను కలబడ్డాను
చీకటి గొంతు నులిమేశాను -
దాని నోట్లోంచి వేలాడే
బారెడు నాలుక అంచుల మీదుగా
వెలుగు బొట్లు బొట్లుగా
స్రవించసాగింది
అది ఎంత వెలుగును మింగింది!
వెలుగుతో విశ్వం నిండింది
నేను హంతకుడ్ని
నన్ను ఉరి తీయండి
***********************************
కవిత 7
మార్క్సిజం
5-10-1989. మరో రెండు రోజుల తరువాత మా పెద్ద పాప మనోజ్ఞ మొండితనాన్ని చూసి 'మార్క్సిజం' రాసాను.
మా పాప, చూసిన ప్రతి వస్తువు తనకే కావాలంటుంది
తనదేనంటుంది
బుజ్జగిస్తే బుసలు కొడుతుంది
కసురుకుంటే కన్నీరు పెడుతుంది
కోపంతో పాపను పిలిచి -
నువ్వు క్యాపిటలిస్టువన్నాను
బూర్జువావన్నాను
దోపిడీ వర్గంలో ఉన్నావన్నాను
పాప నవ్వింది -
అవేవీ తనకు తెలియనట్లు
అవేవీ తాను కానట్లు
పాప నవ్వింది -
అచ్చు క్యాపిటలిస్టులా
అచ్చు బూర్జువాలా
**********************************
కవిత 8
నిన్న కోసిన ఎర్ర గులాబీలు
10-10-1989. కులపిచ్చి, మతోన్మాదము, స్వార్థ రాజకీయాలూ, అధికార దాహం, అవినీతి, ధన దాహం, పేదరికం ఇవన్నీ ఉన్న చోట ప్రజాస్వామ్యం కోసం వెతుకులాటే ఈ కవిత.
కులాల పడవల్లో రక్త కాసారాల్లో
కేరళ సామూహిక పడవ పోటీలను
తలదన్నే పోటాపోటీలు
రామాలయాలపై మసీదులు
మసీదులపై రామాలయాలు
చెట్టు ముందా విత్తు ముందా
అంతుతెలియని వింత చారిత్రక
రక్తాక్షరాల రామ శిలాశాసనాలు
మతాల మత్తులో మరమ్మత్తుకు
వీలుకాని మేధస్సులు
కర్కశత్వం కరుడు గట్టిన
లాఠీలు పెట్టుకున్న టోపీలు
లాకప్పుల పైకప్పులు చెప్పే రహస్యాలు
నక్సలిజం ఎక్కుపెట్టిన
తుపాకి గొట్టం చివర
అమాయకుల తుది శ్వాసల పొగలు
నిస్సహాయుల నిశ్శబ్దపు దిగులు
ఉన్మత్తుని చేతిలో లైసెన్స్ డు రివాల్వర్
వెర్రి తలలు వేస్తున్న టెర్రరిజం
వల్లకాట్లో చేస్తున్న నిత్య పిండప్రదానం
ఏది ప్రజాస్వామ్యం?
రాజకీయాల్లో రంగుమార్పుల వడి తాకిడికి
సిగ్గుతో ఆత్మహత్యకు పాల్పడ్డ ఊసరవెల్లి
ఆత్మకథలో అంతరార్థం
బోఫోర్స్ శతఘ్నల శత అగ్నుల
కాలి బూడిదగా మారిన
సామాన్యుని పిచ్చి నమ్మకం
నోట్లతో ఓట్ల కొనుగోలు
ఖద్దరుకో కాషాయానికో మేలు
ఏదీ ప్రజాస్వామ్యం!
కరుడు గట్టిన శరీరాలనుండి
కారే చిక్కటి స్వేద జలం - మన వేదఫలం
ఆనకట్టలులేని నదీజలాల్లా
సముద్రాల్లో సంగమించడం
కళేబరాలను కాల్చుకు తినడం
అంగాంగాలను అమ్ముకు మనడం
ప్రభుత్వ గుమస్తా ఆశల సౌధం పై
ఎగురుతున్న పొదుపు పథకాల తీతువు
శాస్త్రీయ దృక్పథం కుక్క మూతి పిందెలు
నూతన విద్యా విధానం వీధివీధికి
ప్రసాదించిన కుక్క గొడుగులు
సరదాల పరదాల వెనుక
శాడిజం చేస్తున్న పైశాచిక కృత్యం
అంతస్తుల దొంతరల నడుమ
ప్రేతాత్మల విషాద విలాపాల
కరాళ నృత్యం
ఏది ప్రజాస్వామ్యం? ఏదీ ప్రజాస్వామ్యం!
అందుకే -
అరిస్టాటిల్ అన్నాడట
"ప్రజాస్వామ్యమంటేనే అవినీతీ
అసమర్థత కలగలిసిన ప్రభుత"అని
మరి మన జవహర్ కన్నకలలు
నిన్న కోసిన ఎర్ర గులాబీలు
***********†*************************"
కవిత 9
మరణించిన చిన్ని పాప
10-11-1989. Nazim Hikmet అనే ఒక విదేశీ రచయిత ఆంగ్లంలో వ్రాసిన 'THE DEAD LITTLE GIRL' అన్న కవితకు ఇది తెలుగు అనువాదం. ఇదిINDIA-GDR అన్న Monthly Journal of All India Indo-GDR Friendship Association, Vol IX No. 5, September 1982 issue లో ప్రచురింపబడింది. ఇక్కడ మొదట English Version న్నూ తరువాత దానికి నేను చేసిన తెలుగు అనువాదాన్ని పొందుపరుస్తున్నాను.
The Dead Little Girl
- Nazim Hikmet
It is me knocking at your door
- how many doors I've been.
But no one can see me
since the dead are invisible.
I died at Hiroshima,
that was ten years ago.
I am a girl of seven,
dead children do not grow.
First my hair caught fire,
then my eyes burnt out.
I became a handful of ashes
Blown away by the wind.
I don't wish anything for myself,
for a child who is burnt to cinders
can not even eat sweets.
I'm knocking at your doors,
aunts and uncles, to get your signatures,
so that never again children will burn,
and so they can eat sweets.
మీ తల వాకిలి తట్టింది నేనే
ఇలా ఎన్ని ముఖ ద్వారాలను
నేను దర్శించానో -
కానీ ఎవ్వరూ నన్ను చూడలేరు
మృతులగోచరులు గనుక
నేను హిరోషిమాలో మరణించాను
పది వసంతాల వెనుకే
అయినా నేనేడేళ్ళ బాలికనే
మృతశిశువులకు
ఎదుగుబొదుగులేమిటి?
నా శిరోజాలు తొలుత కాలిపోయాయి
పిదప కళ్ళు మాడి పోయాయి
నేనో పిడికెడు బూడిదగా మారాను
గాలి తాకిడికి ' ఉఫ్' అని ఎగిరి పోయాను
నాకై నేనేమీ కోరుకోను -
కాలిబొగ్గై పోయిన శిశువును
మిఠాయీలు కూడా తినలేని దానను
ఆంటీలూ, అంకుల్సూ!
ఇక ముందు పసి పిల్లలు
మసిగా మారకూడదని
వారు మిఠాయీలు తినగలగాలని
నేను మీ తల వాకిలి తడుతున్నాను
మీ సంతకాల కోసం
*************************************
కవిత 10
చైతన్య మహా స్రవంతి
30-3-1990. అనేక సంవత్సరాలు కారాగారంలో మగ్గి విడుదలైన సందర్భంగా మండేలా గురించి పతాక శీర్షికల్లొ వార్తలు చదివినప్పుడు ఇలా రాయాలనిపించింది.
కోటానుకోట్ల గొంతుకలు ఫ్యూజ్ అయి
ఒక్క గొంతుగా మారాయి - గుండెలు మండేలా
అనంత కోటి హస్తాలు ఒక్కసారే షేక్ హ్యాండ్
తీసుకున్నాయి - హృదయం పిండేలా
శత సహస్ర కోటి పాదాలు
ఒక్కటై కదం తొక్కాయి - విశ్వం నిండేలా
బానిసత్వపు దుర్గంధంలో
స్వేచ్ఛా మలయ మారుతం
ముప్పై వత్సరాలకు
లీక్ అయి ప్రాణాలు లేపింది
నా మిత్రుడన్నాడు -
'ఎక్కడుంది చైతన్యం?
శవమై వల్లకాట్లో
గుంటనక్కల పాలైందని'
వాడి'పల్స్' చూసుకోమన్నాను; ఆడడం
లేదేమోనన్న అనుమానంతో
అవును!
మండే హృదయ దీపికను
మార్గ సూచిగా పట్టుకుని
బానిసత్వ తామస హరణం చేస్తున్న
ఆ వృద్ధ యువ కిశోరం ఎవరు!?!
**************************************
కవిత 11
జోల
12-3-2013. దాదాపు పదమూడేళ్ళ పాటు రచనకు దూరంగా ఉన్నాను. 1989-90 ప్రాంతంలో EAMCET బోధించడం మొదలు పెట్టినప్పటినుండీ ఇప్పటి వరకు గణితం తోనే కాలం కరిగి పోయింది. మా మనోజ్ఞ పెద్దమ్మాయి శ్రద్ధను దాని చిన్న తనంలో ఊయలలో నిద్ర పుచ్చడానికి జోల పాట అవసరమైంది. అలా ఆశువుగా రోజూ పాడిన జోల పాటే ఈ రూపం దాల్చింది. తెలియకుండానే 19 మాత్రల ఛందస్సు లో ఇది ఒదిగింది. అన్నమయ్య రాసిన 'జో అచ్యుతానంద జో జో ముకుందా' ప్రేరణ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.
సిన్నారి మా శ్రద్ధ బజ్జుకున్నాదీ
సద్దు సేయక మీరు జారుకోవాలీ. జో జో
నిద్దట్లొ తానేమొ కలలు కంటాదీ
కలలోన తాతనే కలుసుకుంటాదీ జో జో
తాత సెప్పిన కథలు కలవరిస్తాదీ
హనుమాను అంటాది రాముడంటాదీ. జో జో
సెయ్యూపి గద అంటూ 'డిష్' మంటాదీ
దయ్యమని రాక్షసని వణికి పోతాదీ. జో జో
ఏడు సేపలు దెచ్చు రాకుమారూలూ
కలలోకి వస్తారు గుర్రాలపై నా. జో జో
ఎండనీ ఒక సేప మాట్లాడతాదీ
గడ్డి మోపు తనకు అడ్డమొచ్చేననీ. జో జో
కోపమొచ్చి ఆవు అంటుంది ఇట్లా
"గొల్లవాడు నాకు మేతెయ్యలేద"నీ. జో జో
గొల్లవాడూ మాత్రమూరుకుంటాడా
అవ్వ బువ్వ పెట్టలేదనీ అంటాడు. జో జో
అవ్వేమి తక్కువా తినలేదు శ్రద్ధా
పాప ఏడ్చీనాది నేనేమి సేతూ
అని దెప్పి సెప్పింది రాకుమారునికి
తన తప్పు ఏముందొ సెప్పమన్నట్లూ. జో జో
పాపేమొ అంటుంది సీమ కుట్టిందని
సీమ కుడితే నాకు ఏడుపొచ్చిందని జో జో
ఆ సిట్టి సీమా కొరకొరా సూసింది
నా బంగారు పుట్టలొ ఏలెట్టలేద
కుట్టకుండా నేను ఊరుకుంటానా
సెప్పవే సిన్నారి పాప అన్నాది. జో జో
సిన్నారి మా శ్రద్ధ బజ్జుకున్నాదీ
సద్దు సేయక మీరు జారుకోవాలీ. జో జో
***************************************
కవిత 12
సమైక్యాంధ్ర
27-8-2013. మా కళాశాల ఆవరణలో ఉద్యోగులమంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న సమయమది. ప్రసంగాల మధ్య పాడుకోవడానికి ఒక ఉద్యమ గీతం లాంటిది రాయాలనిపించింది.
ఉద్యమించు ఉద్యమించు
ఉద్యమాల జోరు పెంచు
ఉరి కొయ్యల పైన కూడ
నినాదాల హోరు నించు
ఎవడు వాడు ఎవడు వాడు
ఎవడు వాడు కేసీఆర్
తెలుగు తల్లి పాలు తాగి
రొమ్ము గుద్దు పుండాకోర్. ఉద్యమించు
మంత్రి పదవి రాలేదని
సీయమ్మే కావాలని
వెనుక బడ్డ ప్రాంతాలను
రాష్ట్రాలుగ మార్చాలని
వితండాలు చేసినాడు
తెలంగాణ అడిగినాడు. ఉద్యమించు
తల్లి ప్రేమ చెడ్డదంటె
నమ్మలేదు ఇన్నాళ్లూ
కన్నబిడ్డ పీయమ్మై
గద్దెపైన కూచుంటే
చూడాలని సోనియమ్మ
తెలుగు తల్లి గొంతు కోసి
రక్తాన్నే తాగుతోంది. ఉద్యమించు
తమిళనాడె కేంద్రంలో
తలమానికమవ్వాలని
పెత్తనాలు చెయ్యాలని
తెలంగాణ సీమాంధ్రల
ముక్కలుగా చీల్చడమే
చిదంబరుని రహస్యం. ఉద్యమించు
సోనియమ్మ స్క్రిప్ట్ తో
నాటకాలు ఆడుతున్న
మన నేతలు ఆస్కారుకు
అందనంత ఎత్తులోన
ఉన్నారట ఏంజేస్తాం
సొంతంగా గెలవలేరు
సోనియమ్మ టికెట్టిస్తె
గెలిసినంత సంబరాలు
ఉత్సవాలు ఉత్తడౌలు. ఉద్యమించు
ఇంత మంది స్వార్థానికి
కొంత మంది ద్వేషానికి
తెలుగు తల్లి బలియైతే
ఊరుకోము ఊరుకోము
సమైక్యాంధ్ర వచ్చు వరకు
నిరసిస్తాం నినదిస్తాం. ఉద్యమించు
